దళిత సేవలో నాలుగో సింహం

Crime

అర్బన్‌ జిల్లాలో 19 వాటర్‌ ట్యాంక్‌ల ఏర్పాటు

పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు పోలీసు నిధి

దళిత గ్రామాల్లో 20 వేల మొక్కల పెంపకం

క్రీడల్లోనూ ఫ్రెండ్లీ ప్రోత్సాహం

ప్రశంసలు అందుకుంటున్న అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌

వృత్తిలో ఒత్తిడి ఉన్నా సేవభావంలో ఆదర్శంగా నిలిచే వారు అరుదుగా ఉంటారు. సరిగ్గా అలాంటి ‘రియల్‌ పోలీస్‌’ అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. 19 దళిత గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు నీటి సౌకర్యం కల్పించారు. పచ్చదనం పరిరక్షణలో భాగంగా 20వేల మొక్కలను నాటించారు. దళిత గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ ఫ్రెండ్లీ పోలీసును మనమూ పలుకరిద్దాం.. -తిరుపతి, క్రైం.

 తిరుపతి: దళితుల అభ్యున్నతికి తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్భురాజన్‌ తన వంతు సహకారం అందిస్తున్నారు. తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలోని మారుమూల దళిత గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనతోపాటు అన్ని రంగాల్లో వారు రాణించేలా కృషి చేస్తున్నారు. ఇందు కోసం పోలీసు సహాయ నిధి నుంచి నిధులను సైతం తెస్తున్నారు. గుక్కెడు నీటికోసం అల్లాడుతున్న గ్రామాలకు నీరందించాలనే ఆయన ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. అర్బన్‌ జిల్లా పరిధిలోని గ్రామాల్లో 19 వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నారు. పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాఠశాలలను అధికారులు పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపుతున్నారు. అనంతరం ఆయా పాఠశాల్లో మరుగుదొడ్లు, నీటి సౌకర్యంతో పాటు విద్యార్థులకు క్రీడా సామాగ్రిని సైతం అందజేస్తున్నారు.

పచ్చదనం పరిమళించేలా 
గ్రామల్లో పచ్చదనం పరిమళించాలనే సంకల్పంతో పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 20వేల మొక్కలు నాటారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సంరక్షకుడిని నియమించారు. నిత్యం మొక్కల సంరక్షణపై కింద స్థాయి సిబ్బంది నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు.

ఫ్రెండ్లీ పోలీసుకు సరికొత్త నిర్వచనం 
ప్రజలతో పోలీసులు సఖ్యతగా ఉండేలా అర్బన్‌ ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసు అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. దళిత గ్రామాల్లోని యువకులు, క్రీడాకారులతో కలసి ప్రతి శనివారం పోలీసులు క్రీడా టోర్నమెంట్‌లను నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రాచుర్యం పొందిన వాలీబాల్, కబడ్డీ, క్రికెట్‌ క్రీడల్లో పోటీలను నిర్వహించడం, ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వారికి క్రీడా పరికరాలను విరాళంగా అందజేస్తూ ప్రసంశలు అందుకుం టున్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి
దళిత గ్రామాల్లో వసతుల కల్పనకు పోలీసు శాఖ విశేషంగా కృషి చేస్తోంది. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే అసమానతలు తొలగిపోతాయి. సమాజ అభివృద్ధితో పాటు దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో దళిత గ్రామాల అభివృద్ధికి శాఖాపరంగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తున్నాం. వారికి క్రీడాపోటీలు నిర్వహిస్తూ స్నేహభావాన్ని పెంపొందింపజేస్తున్నాం. ప్రధానంగా దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *