ఎవరు?..ఎందుకు?

Crime

ఏమిటి ? – యువతి కిడ్నాప్‌

ఎప్పుడు ? – మంగళవారం (23న)

ఎక్కడ? – హయత్‌నగర్‌లో..

ఎలా ? – మాటల్లో దించి కారులో..

ఎవరు ? – గుర్తుతెలియని యువకుడు

ఎందుకు ? – తెలియదు

యువతి కిడ్నాప్‌.. అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగింది. నిందితుడుతాననుకున్నది అనుకున్నట్లే చేశాడు.. యువతి తండ్రి నిర్వహించే టీదుకాణం వద్దకు కారులో రావడం.. అతనిని మాటల్లో పెట్టడం.. అతను నమ్మి కుమారుడు,కుమార్తెను తీసుకొని నగరంలో నిందితుడి కారులో తిరగడం..తరువాత తండ్రి, కుమారులను అతను దారి మళ్లించి యువతిని కిడ్నాప్‌ చేయడం అంతా సినిమాటిక్‌గా జరిగింది. అయితే ఈ కిడ్నాప్‌ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలు మాత్రం అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో అపహరణకు గురైన సోని (21) కిడ్నాపై రెండు రోజులు గడుస్తున్నా గురువారం రాత్రి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి బొంగ్లూర్‌ గేటు వద్ద నివసించే బీ ఫార్మసి విద్యార్థిని ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు వాడిన కారు నెంబర్‌ నకిలీది అని తేలడం, తన ఫోన్‌ నెంబర్‌ను ఎక్కడా వాడక పోవడం, ఎక్కడా కారు దిగిన ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడడంతో..పథకం ప్రకారమే కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. యువతి కిడ్నాప్‌కు గురైన రాత్రి నుంచి పోలీసులు వేట మొదలు పెట్టినా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కేసును చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. నిందితుడి ఆచూకీ డీసీపి సన్‌ప్రీత్‌సింగ్‌ పర్యవేక్షణలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయని ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు. హయత్‌నగర్‌ సీఐ సతీష్‌ ఆధ్వర్యంలోని టీం విజయవాడ వైపు, వనస్థలిపురం డీఐ జగన్నాథ్‌ బృందం ఒంగోలు వైపు, మరో ఎస్‌ఐ ఆద్వర్యంలోని టీం కర్ణాటక బళ్ళారి వైపు వెళ్లాయని, అబ్దుల్లాపూర్‌మెట్టు సీఐ దేవేందర్‌ ఆధ్వర్యంలోని టీం ఓఆర్‌ఆర్‌ టోల్‌ ప్లాజా దాని చుట్టూ పరిసరాలలో గాలిస్తున్నారని, డీఐ శ్రీనివాస్‌ ఆద్వర్యంలోని టీం సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు.

తండ్రి కన్నీటి పర్యంతం…
తన కూతురు ఆచూకీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సోని తండ్రి యాదగిరి పోలీస్టేషన్‌ వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. నిందితుడికి సుమారు 35-40 ఏళ్ల్ల వయస్సు ఉంటుందని తను ఉస్మానియాలో డాక్టర్‌ను అని, తన తల్లిదండ్రులు హైకోర్టులో జడ్జిలని, అన్న అన్న పోలీసు కమిషనర్‌ అని చెప్పడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిందితుని మాటలు నమ్మానని వాపోయాడు. ఉదయం 7:30 గంటలకు మా టీ స్టాల్‌ వద్దకు వచ్చి తనను మచ్చిక చేసుకున్నాడని, అతనితో పాటు బ్రహీంపట్నం వరకు వెళ్ళి కారును వాషింగ్‌ కూడా చేయించానని, వండుకునేందుకు చికెన్‌ తెచ్చుకున్నామని, మా ఇంటి వద్దకు వచ్చి మొఖం కూడా కడుక్కున్నాడని యాదగిరి వాపోయాడు. పోలీసులు తన కూతురిని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *