200 కోట్ల క్లబ్‌లో కబీర్ సింగ్.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న కియారా, షాహిద్

Entertainment

టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్ సినిమాగా తెరకెక్కింది కబీర్ సింగ్ మూవీ. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ కబీర్ సింగ్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించగా ఆయన సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన కబీర్ సింగ్ బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

మొదటి షోతో సక్సెస్ టాక్ తెచ్చుకున్న కబీర్ సింగ్ బాలీవుడ్ ఆడియన్స్‌ని ఫిదా చేసింది. చిత్రంలో హీరో షాహిద్ కపూర్ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు బీ టౌన్ ప్రేక్షకులు. విజయవంతంగా ప్రదర్శించబడుతున్న కబీర్ సింగ్ కేవలం 13 రోజుల్లోనే 200 కోట్ల మార్కును దాటేయడం విశేషం. నిన్నటి వరకు ఈ సినిమా 213.20 కోట్ల రూపాయలు రాబట్టిందని సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. మొదటి వారంలో 134.42 కోట్లు, రెండో వారంలో 78.78 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలయ్యాయని, మొత్తంగా చూస్తే 213.20 కోట్ల రూపాయలు వసూలయ్యాయని ఆయన పేర్కొన్నాడు.

2019 సంవత్సరంలో ఇప్పటి వరకు వచ్చిన హిందీ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా కబీర్ సింగ్ తన పేరును లిఖించుకుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. అంతకుముందు భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ కూడా అధిగమించేసింది కబీర్ సింగ్. హీరో షాహిద్ కపూర్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కబీర్ సింగ్ రికార్డు నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *