ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మేము సెమిస్ చేరం : పాక్ కెప్టెన్

Sports

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడబోయే చివరి మ్యాచ్‌లో తాము శక్తిమేర రాణించి న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడిన అతడు పై విధంగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధించి ఆ తర్వాత 316 పరుగుల తేడాతో గెలవాలి.

ఈ సందర్భంగా సర్ఫరాజ్‌ మాట్లాడుతూ ఏదైనా అద్భుతం జరిగి దేవుడు కరుణిస్తే తప్ప తాము సెమీస్‌ చేరమని చెప్పాడు. అంతటి ఘన విజయం సాధించడం వాస్తవికంగా కష్టతరమైనప్పటికీ గెలవడానికి మాత్రం ప్రయత్నిస్తామని చెప్పాడు.మరోవైపు బంగ్లాదేశ్‌.. టీమిండియా చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అక్కడితోనే సరిపెట్టుకొంది. ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప పాక్‌ సెమీస్‌ చేరదు. దీంతో పాక్‌ X బంగ్లా మ్యాచ్‌ ప్రత్యేకంగా నిలవనుంది.

పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి మూడు ఓటమిపాలైంది. మరొక మ్యాచ్‌ రద్దైంది. దీంతో 9 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ బంగ్లాపై గెలిచినా 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమానంగా ఉంటుంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ ఇప్పటికే కివీస్‌ జట్టుది +0.175 ఉండడం, పాకిస్థాన్‌ది -0.792గా నమోదవడంతో పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం అసంభవమనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *