ఇదే నా ఆఖరి ప్రపంచకప్‌: క్రిస్‌గేల్‌

Sports

వెస్టిండీస్‌ జట్టు సెమీస్‌ చేరకపోవడం చాలా బాధగా ఉందని ఆఖరి ప్రపంచకప్‌ ఆడిన విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ అన్నాడు. తాను ఇక్కడివరకూ రావడానికి తెర వెనుక ఎన్నో పరిణామాలు జరిగాయని అవన్నీ ప్రత్యేకమేనని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడిన నేపథ్యంలో యూనివర్స్‌ బాస్‌ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. గత ఐదు ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గొప్పగా ఉందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.

తమ జట్టు ప్రపంచకప్‌ గెలుచుంటే చాలా సంతోషించేవాడినని, కానీ అది కుదరలేదని గేల్‌ వాపోయాడు. అయితే ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించానని, ఎన్నో మధుర జ్ఞాపకాలతో చాలా సందడిగా మారిందని గుర్తుచేసుకున్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరూ ఎంతో సహకరించారని, ముఖ్యంగా యువ ఆటగాళ్లు తనతో కలిసిమెలిసి తిరిగారని వివరించాడు. ఈ సందర్భంగా తమ జట్టుకు విలువైన సూచనలు, సలహాలు చేసి ఇక్కడి వరకు తమని ముందుకు నడిపించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సమయంలో మాట్లాడేందుకు తనకు మాటలు రావడం లేదని గేల్‌ భావోద్వేగం చెందాడు.

ఇదిలా ఉండగా గేల్‌ వచ్చేనెల టీమిండియాతో ఆడే సిరీస్‌ తర్వాత రిటైరౌతాడని తెలుస్తోంది. అయితే తాను రిటైరైనా విండీస్‌ జట్టుకు తోడుగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌ గెలవకపోయినా జీవితం సాగిపోతుందని పేర్కొన్నాడు. ఇదే తన చివరి ప్రపంచకప్‌ అని, ఇకపై తన శరీరాన్ని కష్టపెట్టదలచుకోలేనని చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో గేల్‌ 7 పరుగులే చేసినా వెస్టిండీస్‌ అఫ్గాన్‌పై 23 పరుగులతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ పోరాడినా 288 పరుగులకు ఆలౌటైంది. దీంతో ప్రపంచకప్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా అఫ్గాన్‌ జట్టు నిష్క్రమించింది. మరోవైపు విండీస్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండు గెలిచి ఆరు ఓటమిపాలైంది. ఒక మ్యాచ్‌ వర్షంతో రద్దైంది. దీంతో 5 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *