ఎమ్మెల్యేలను పశువులను కొంటున్నట్లు ముప్పై కోట్లు ఇచ్చి కొంటున్నాడంటే వ్యవస్థ ఏమవుతుందని విపక్ష నేత జగన్ అన్నారు. ఇరవై మందికి ఆరువందల కోట్లు పట్టపగలు ఇస్తే వ్యవస్థ ఏటుపోతోందని అన్నారు. ఓటుకు నోటు కేసు జరిగిన తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లలేదంటే మన ప్రజాస్వామ్యంలో లోపం అని అన్నారు. సినిమాలో పద్నాలుగు రీళ్లలో పదమూడు రీళ్లలో విలన్ దే పైచేయి గా కనిపిస్తుందని, కాని పద్నాలుగో రీల్ క్లైమాక్స్ కధలో హీరో విలన్ ను వీరబాదుడు బాదుతాడని సినిమాలో చివరకు విలన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తాడని, జీవితం అనే సినిమాలో కూడా అదే జరుగుతుందని ఆయ అన్నారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న వ్యక్తి ఇలా మోసాలు చేస్తూ పోతూ,ప్రజలు చూస్తూ ఊరుకుంటూ పోతే వ్యవస్థ బాగుపడుతుందా అని ఆయన అన్నారు. రాజకీయనాయకుడు ఎవరైనా అబద్దాలు,మోసాలు చేస్తే చెప్పులు చూపుతామని ప్రజలు చెబితే, చీపుళ్లు చూపుతామని చెబితే అప్పుడే వ్యవస్థ మారుతుందని తెలిపారు. ఇది తనకైనా వర్తిస్తుందని అన్నారు. చంద్రబాబు ఈసారి రుణమాఫీ మాత్రమే ఇంతవరకు చెప్పారని, ఇది జరగకపోతే చంద్రబాబు వచ్చేసారి ప్రతి ఇంటికి కారు కొనిస్తానని, విమానం కొనిస్తానని చెబుతాడని అన్నారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలు సగర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలని జగన్ కోరారు.
|